చారిత్రక నేపథ్యం :
''తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స''
- శ్రీకృష్ణదేవరాయలు
అంతటి మధురత్వాన్ని కలిగిన తెలుగు భాష సహజంగా మన మాతృభాష అయినందుకు, ఆంధ్రులుగా మనం పుట్టినందుకు మనమందరం ఎంతో గర్వపడాలి. అటువంటి తెలుగుభాష ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో నేటికి సందేహాత్మకమే. దక్షిణ-మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన మన తెలుగు భాష భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృ, అధికార భాషలుగా వ్యవహారంలో వుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు పదిహేనవ స్థానంలోను, మన భారత దేశంలో రెండవ స్థానంలోను నిలుస్తుంది.
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య దాదాపు 8.61 కోట్లపైబడి ఉన్నారు. మన భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో తెలుగు భాష కూడా ఒకటి. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అక్టోబరు 31, 2008వ సంవత్సరంలో అతి ప్రాచీన దేశ భాషలయిన సంస్కృతము, తమిళ భాషల యొక్క సరసన చేర్చింది. ఇది విశ్వవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారందరికీ భారత ప్రభుత్వము అందించిన విశిష్ట గౌరవంగా భావించవచ్చు.
క్రీస్తుశకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన ''గాథాసప్తశతి'' అన్న మహారాష్ట్ర ప్రాకృతి పద్య సంకలనంలో పెద్ద సంఖ్యలో తెలుగు పదాలు కనిపించాయి. కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు, శాత వాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారనే అభిప్రాయం కలదు. తెలుగు భాష మూల పురుషులు యానాదులు పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల కాలం నాటిదని చెప్పవచ్చు. అయితే క్రీ.పూ.1500 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము(రుగ్వేదం)లో తొలిసారిగా 'ఆంధ్ర' అనే పదాన్ని జాతిపరంగా వాడినారు. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది.క్రీ.పూ 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనిక బలం ఉన్న వారని వర్ణించాడు.
తెలుగు చరిత్రను మనము క్రీ.శ.6వ శతాబ్దము నుండి లభ్యమౌతున్న ఆధారాలను బట్టి నిర్ణయింపవచ్చును. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. క్రీ.శ3వ శతాబ్దికి చెందిన అమరావతి శాసనంలో మనకు లభించిన తొలి తెలుగు పదం ''నాగబు''
కాని నన్నయ కాలం నుండి తెలుగు భాష గ్రంథస్తం అయిందని చెప్పవచ్చు. నన్నయకు పూర్వం సాహిత్యం వెలువడిననూ వాగ్రూపంలో వినిపిస్తున్నను, లిఖితపూర్వకంగా మనకు లభ్యము కాలేదు. కావున క్రీ.శ.11వ శతాబ్దం నాటి సాహిత్యం లభ్యమౌతున్నది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రాచీన సాహిత్యానికి మూలం 'జానపద సాహిత్యం' అయి వుండవచ్చనేది సాహిత్యకారుల అభిప్రాయం. తెలుగు భాషలో దాదాపు ప్రతిపదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. అందుకే 'తెలుగు' అజంత భాషగా ప్రఖ్యాతి గాంచినది. ఈ ప్రత్యేకతను గుర్తించిన 15వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ యాత్రికుడు 'నికొలోడాకాంటి'' తెలుగును ''ఇటాలియన్ ఆఫ్ది ఈస్ట్గా''గా అభివర్ణించాడు.
భాష కాలనుగుణంగా మారుతుంటుంది. మార్పు చెందని భాష మాతృభాష కాక తప్పదు. అంతేకాకుండా రాజకీయ, ఆర్థిక సామాజిక, ప్రాంతీయ ప్రభావాలు కూడా భాషపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.