మన ప్రాచీనాలంకారికులు చెప్పిన నవరసాల్లో హాస్యం కూడా ఒకటి. హాసం అంటే నవ్వు. ఆ నవ్వును పుట్టించేదే హాస్యం. నవ్వు నాలుగందాల చేటని కొందరు నీరసవాదులు నిరసించినా, నేడు “నవ్వు” అన్నదానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించడం వల్లే చాలా ఊళ్లలో ‘హ్యూమర్ క్లబ్స్’ వెలిసాయి.
పనిగట్టుకుని రోజూ గంటసేపు నవ్వడం ఆరోగ్యం కోసమే అని ప్రకటన ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్’ కాబట్టి అదుపాజ్ఞలు లేని నవ్వు కూడా సమర్ధనీయం కాదు. ప్రసన్నమైన చిత్తవృత్తిని ప్రకటించే చక్కని సాధనం నవ్వు. వాగ్గతమైన హాస్యం ఆరోగ్య ప్రదాయిని..
నవ్వించడమనేది సృజనాత్మక కళ. సంస్కారయుతమైన పదజాలంతో ఇతరులను నొప్పింపక తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం సామాన్యమైన విషయం కాదు. హాస్యం హృదయాల్ని తేలికపరుస్తుంది కాని దాని సృష్టి మాత్రం అంత తేలికకాదని ఒక ఆంగ్ల కవి ఇలా అన్నాడు. It lightens the heart, But the process to arrive at it requires serious thinking .
మనిషి జీవితం పుట్టుక నుండి చావు వరకు దుఃఖమే. అయితే అందులోనే తనకు కావలసిన ఆనందాన్ని వెతుక్కోవడానికి, పదిమందికి పంచడానికి మనిషి సాహిత్య సృష్టి చేసాడనుకోవచ్చు. ఈ ఆనందాన్వేషణ మనిషిని మిగిలిన జీవరాసులనుండి వేరు చేస్తోంది.
ఒక మహాకవి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పాడో చూడండి.
“నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు . కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖదమంబులు వ్యాఖులకున్ మహౌషధుల్. ”
జంతువులనుండి మనిషిని వేరు చేసే ‘నవ్వు’ విషపూరితం కాకుండా పువ్వుల మృదువైన ప్రేమరసాన్ని అందించి దుఃఖాన్ని, రోగాన్ని ఉపశమింప చేయాలని కవి సూచన. అలాంటి నవ్వే చిత్తవృత్తికి దివ్వె అవుతుంది. గాంధీగారు కూడా “If I had no sense of humor, I would long ago have committed suicide” అన్నారు. నవ్వగలగడం ఒక వరం. ఒక ఐశ్వర్యం. అందుకే కీ.శే.జంధ్యాల
“నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒక భోగం
నవ్వలేకపోవడం ఒక రోగం” అన్నారు.
“A man is not poor if he can still laugh” అంటాడు హిట్లర్. “Though the room is big if there is no place to humor , we can say it is congested” అని ఇంగ్లీషులో ఒక వాక్యముంది.