నేనూ - నా స్నేహితులు - అరసం

చాగంటి సోమయాజులు (చాసో)
1942 సంవత్సరం ప్రారంభంలోనో మధ్యలోనో చదలవాడ పిచ్చయ్య మావూరు దిగబడ్డాడు. ముస్లిం టోపీ ఒకటి నెత్తిమీద పెట్టుకున్నాడు. సెట్టి ఈశ్వరరావూ అతనూ కలసి మా ఇంటికి వచ్చారు.

''ఇదేంటీ? మహమ్మదీయ మతం పుచ్చుకొన్నావా?'' అని అడిగాను. ఆయన మహమ్మదీయ మతం పుచ్చుకోలేదు. తలమీద తీవ్రమైన దెబ్బతగిలింది. ఆ దెబ్బకి మందు వేసుకుంటూ ఈ టోపీ పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఆయనకి తలమీద దెబ్బ ఎందుకు తగిలింది? వాళ్ల స్వగ్రామంలో రైతు కూలీ సంఘం పెట్టాడు. ఆ రైతు కూలీ సంఘం వాళ్లు అస్పృశ్యులు. వాళ్లతో కలిసి, వాళ్లని సంఘటితపరిచి వాళ్లతో తిరుగుతూ గ్రామంలోనే ఓ సంఘం పెట్టాడు. వాళ్ల నాన్నకి చాలా కోపం వచ్చింది. మానమని ఎంత చెప్పినా మానలేదు. ఇంటికి వెళ్లగానే కర్రతో ఓ బాదు బాదేడు. ఆ దెబ్బతిని మరింత తీవ్రమైన పౌరుషం వచ్చి ఇల్లు వదిలేసేడు. దెబ్బకి కట్టుకట్టించుకుని, తను అనుకున్న పని చేసే విపరీతమైన పట్టుదలగల మనిషేమో అలాగే ఆ దెబ్బతోనే విజయనగరం వచ్చేశాడు. మేమందరం ఎక్కడికక్కడ అభ్యుదయ రచయితల సంఘం పెట్టాలనుకొంటున్నాం. అంటే ప్రొగ్రసివ్‌ రచయితలందర్నీ కూడగట్టుకొని ఓ సంఘం ఏర్పాటు చేసే ప్రయత్నం. దానికాయనగారు నియోగించబడి విజయనగరం వొచ్చాడు. అది సెట్టి ఈశ్వరరావుకూ నాకూ అభిమానమైనదే. ఆ ఏర్పాటు మా వూళ్లోనే చెయ్యాలనే పట్టుదల ఈశ్వరరావుకీ ఉంది. నాకూ వుంది. మేం ఇద్దరు ప్రధానమైన వాళ్లమని చెప్పొచ్చు. కుర్రవాళ్లం. కాని ఈశ్వరరావూ నేను ఎంత చెప్పినా పిచ్చయ్య ఒప్పుకోలేదు. పిచ్చయ్య తెనాలిలోనే సభ పెట్టాలని నిర్ణయించేశాడు.

 


1943లో తెనాలిలో సభ చేసాం. ఈ సభ చేసినప్పటికి దానిలో వున్న సభ్యులందరం ముప్పై సంవత్సరాలలోపు వాళ్లమే. 30 ఏళ్లు దాటిన వాళ్లెవరూ లేరు. అధ్యక్షులుగా తాపీ ధర్మారావుగారిని పెట్టుకున్నాం. ఎంచేతా అంటే ఆయన వామపక్షానికి కాస్త మొగ్గుచూపిస్తున్న మనిషీ, కాస్త శాస్త్రీయమైన ఆలోచనాక్రమం వున్నవాడు కాబట్టీ తెనాలిలో ఆ సభ బాగానే జరిగింది. అన్ని జిల్లాల నుంచీ ఇంచుమించు వచ్చారు. అయితే రాయసీమ నుంచి ఎవరూ రాలేదు. అదేం విచిత్రమోగాని రాయలసీమలో భావకవుల్లేరు. అభ్యుదయ సంఘం స్థాపించిన నాటికి అభ్యుదయ రచయితలూ లేరు. ఎవరూ రాస్తున్న వాళ్లు లేరు. కాని ప్రతినిధులు వచ్చారు. మొత్తంమీద సభ బాగానే జరిగింది. వామపక్ష రచయితల సభ అని మేం పెట్టుకున్నాం. ప్రజాసాహిత్యం అన్నమాట కూడా దానికి తోడుగా వున్నది. అయితే మాకు సహకరించని వాళ్లు ఇద్దరు ప్రముఖులున్నారు. వాళ్లిద్దరూ బాగా సహకరిస్తారని మేం అనుకున్నాం. అందులో ఒకరి పేరు మా విజ్ఞప్తిలో ప్రధానంగా వేశాం. అతను శ్రీరంగం శ్రీనివాసరావు. రెండో వ్యక్తి కొడవటిగంటి కుటుంబరావు. ఈ ఇద్దరూ మాకు తప్పకుండా సహకరిస్తారనుకుంటే వాళ్లు తప్పకుండా సహకరించలేదు.


తెనాలిలో సభ అయిపోయిన తర్వాత వాళ్లిద్దరితో పోరాడ్డానికి చెన్నపట్నం వెళ్లాం. శ్రీశ్రీ మీరు చేస్తున్నారు కదా నా కిష్టమే చెయ్యండి అన్నాడు. కాని తాను చేస్తాననలేదు. కుటుంబరావు రచయితలకి సంఘమెందుకు ఎవరి మానాన వాళ్లు రాసుకోండి అన్నాడు. తెనాలి సభలో ఓ తీర్మానం చేశాం. మహాప్రస్థానం అచ్చువెయ్యాలని. కాని శ్రీశ్రీగారు మా కెన్నో విషమ షరతులు పెట్టాడు. ఆ పుస్తకం అచ్చువెయ్యడం అసాధ్యం చేసిపెట్టాడు. సైజు ఇంతుండాలి. ఎక్కడా ఎప్పుడూ ఎవరూ వెయ్యనిసైజు. కాయితం ఫలానా కాయితం అంటూ! ఆ రోజుల్లో పుస్తకాన్ని మామూలుగా రూపాయికివ్వొచ్చు. కాని ఆయన పెట్టిన షరతుల పుస్తకం పది రూపాయలక్కూడా రాదు. వామపక్షాన వ్రాస్తున్న వాళ్లమంటున్నాం. ప్రజల పక్షాన అంటున్నాం. ఇంత ఖరీదైన పుస్తకం పెట్టడం తప్పు అని ఎంత ఆర్గ్యూ చేసినా ఆయన ఒప్పుకోలేదు. ఆయన నాకు ఉత్తరం కూడా అలాగే రాశాడు. 'మీరూ మీరూ'' అంటూ రాశాడు. మీరిది చేస్తారా అది చేప్తారా అంటూ రాశాడు. మేం అది చెయ్యలేక దానికో నమస్కారం పెట్టి ఊరుకున్నాం.


కుటుంబరావు మాత్రం మరుసటి సంవత్సరంలో మాతో చేరిపోయాడు. తరువాత సహకరించిన వాళ్లలో బుర్రా సుబ్రహ్మణ్యం ఒకడు. చెన్నపట్నం వాళ్లు తదితరులెవరూ మాకు సహకరించలేదు. తెనాలిలో మేం అంత సభ చేస్తే నార్ల వెంకటేశ్వరరావుగారు ఆంధ్రప్రభలో న్యూస్‌ వెయ్యలేదు. ఆగ్రహం వచ్చింది. ఆయన దగ్గరకెళ్లి అడిగాను. అప్పుడు వార్‌ టైమ్‌. యుద్ధకాలంలో పత్రికలు నాలుగే పేజీలు ఉండేవి. స్థలాభావం. ఎక్కడ వెయ్యం. బోల్డంత న్యూసొస్తున్నది. అంతర్జాతీయంగా యుద్ధ న్యూసులొస్తున్నాయి. మధ్యన మీకు మీ న్యూస్‌కి స్థలం ఎలా ఇవ్వగలం అన్నాడాయన. వెయ్యడానికి ఇష్టంలేక కాదు అన్నాడాయన. రేపో ఎల్లుండో వేస్తానన్నాడు. సరే మంచిదే అని చెప్పి రెండ్రోజులు పాటు ఆంధ్రప్రభ చూశాం. న్యూస్‌రాలేదు! చెన్నపురి ఆంధ్ర మహాసభకి ఓ రెండు బిల్డింగులు వుండేవి. వాట్లో ఓ క్లబ్బు కింద ఉండేది. అక్కడికి తెలుగువాళ్లు చాలా మంది చేరేవారు. నార్లవారి ఆఫీసుకు పదేపదే వెళ్ళేం! సభ జరిగిన వారం రోజుల నాడు నేనాయనకు పెట్టిన ఇబ్బందిపడలేక అంగుళంన్నర న్యూస్‌ వేశాడాయన! ఆయన మాకు సభ్యుడుగా ఉంటాడనుకున్నాం. సభ్యుడుగా కూడా లేడు. ఇదీ అరసం ప్రారంభకథ!


రెండవ సంవత్సరం అరసంతో దేశం మీద బయలుదేరాం కదా! గురజాడ కందుకూరులను మీద కెత్తుతూ తిరుగుతూ ఉంటే ప్రాచుర్యం లభించింది. అరసం పదిమందిలో పడ్డాది. రెండవ సభ బెజవాడలో జరిగింది. దానికి పండితవర్గంలో అయ్యల సోమయాజుల నర్సింహశర్మగారిని సభ్యుణ్ణి చేసి తీసుకొచ్చాం. నారాయణబాబు తొలినుంచీ సభ్యుడే కాని వాడు రాలేదు. జలసూత్రం రుక్మినాధశాస్త్రి తరువాత మాకు సభ్యుడయ్యాడు. పిలకా గణపతిశాస్త్రి సభ్యుడయ్యాడు. నవ్యసాహిత్య పరిషత్తులోని యువతరం వాళ్లు చాలా మంది మా సంఘంలో చేరారు. ఈ చేరడం వల్ల మా ఆశయాలకు విరుద్ధమైన వారు చేరారనే చెప్పొచ్చు. కొంచెం పలచబడ్డాదని చెప్పొచ్చు. మేం చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి జీవితచరిత్ర అచ్చువేశాం. పాపం ఆయనకి కళ్లులేవు. వృద్ధుడు. వాళ్ళింటికి వెళ్లి మీ పుస్తకం వేస్తామని అడిగితే ఆయన చాలా సంతోషించాడు. మీరు నిజంగా వేస్తారా అన్నాడు. ఆయన రాసాడు గాని ఆ రాసింది తన జీవితంలో అచ్చవుతుందని కల గూడ కనలేదు. ఆయన కనుకూలంగా ఆయనకిదిద్దాం అదిద్దాం అని నిర్ణయాలు చేసి ఆ పుస్తకాలు తీసుకొచ్చాం. సభ వారం రోజులు కూడా లేదు. కొన్ని వందల పేజీల పుస్తకం. అచ్చువేసి సభలో ఆవిష్కరించాలి. ఆయనని జాగ్రత్తగా తీసుకొచ్చి (అంధుడైనా) ఆయనని సన్మానించాలి. ఆయనకి ఆ పుస్తకం అందజెయ్యాలి. ఇది కష్ట సాధ్యమైన పనే! కాని కమ్యూనిస్టుపార్టీకి ప్రజాశక్తి అని పత్రికుండేది.


దాని అచ్చుయంత్రం పనివాళ్ళకి ఈ విషయం చెపితే మేం రాత్రింబ వళ్లు కష్టపడి ఆ రోజుకి ఆ పుస్తకం ఇచ్చేస్తాం అన్నారు. అన్న ప్రకారం సభ రోజు రాత్రయేసరికి అచ్చు పని పూర్తి చేసేశారు. ఆ పొద్దున్న బైండు చేసి సభా సమయానికి అరడజనో ఎన్నో పచ్చిఆరనివి పట్టుకొచ్చి సభలో పెట్టారు. సాయంకాలానికి వందో ఎన్నో కాపీలిచ్చారు. పచ్చి పచ్చిగానే ఆ పుస్తకం ఆవిష్కరించబడ్డాది. ఆ వంద కాపీలూ ఆ సభలో ఆ సాయంకాలానికే చెల్లిపోయాయి. ఆ మర్నాడు మరిన్ని కాపీలు ఇచ్చారు. అవీ చెల్లిపోయాయి. అలాగ ఆ పుస్తకాల మదుపంతా వచ్చీడమే గాక మా సభలో కొంచెం లాభం కూడా వొచ్చింది. ఆయన కాపీరైటు మాకిస్తామన్నాడు. ఆ కాపీరైటు మాకొద్దు బాబూ! మిగిలిన పుస్తకాలు మీరమ్ముకోండి అని ఆయనకి ఇచ్చేశాం. నష్టపోతాం అనుకుంటే వెంటనే లాభంతోపాటు అమ్ముడు పోయిందాపుస్తకం! లాభసాటి అయినా మాకు అక్కర్లేదు కదా! ఆయనకి ఆ పుస్తకాలూ ఇచ్చేశాం. కాపీరైటూ అక్కర్లేదనేసాం. చిలకమర్తి వారి కారణం చేత మా సభ విశేషాలను పత్రికలన్నీ ఫుల్‌పేజీ కవర్‌ చేశాయి. ఆయన ఫొటోలు వేసి సభను మెచ్చుకున్నాయి.

ఆ తర్వాత రాజమండ్రి మూడో సభ నాటికి శ్రీశ్రీగారు కూడా మాతో కలిసిపోయాడు! కొ.కు. శ్రీశ్రీ కలియడంలో మాకేం ఆశ్చర్యం లేదు. వాళ్లిద్దరూ తప్పకుండా మా వాళ్లే. కాని మాతో కలిసినవారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి అకస్మాత్తుగా మా పక్షం వహించేశాడు! ఈ ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ వచ్చారు. వాళ్లతో మనం కలిసి ఉండకపోతే, దేశంలో మనం పాతబడిపోయాం. నవ్య సాహిత్యపరిషత్తువారం, అందుచేత మనం దీనిలో ఒకటి అంటే దేశంలో మన కీర్తి ఎప్పటిలాగే వుంటుంది అనే భావంతో ఆయన చేరాడని నా నమ్మకం! ఆయన చేరడం నాకు వాస్తవంగా ఇష్టంలేదు. మేం ఆయనకి విరుద్ధంగా ఉండేవాళ్లం. కాని రాజమండ్రి మహాసభకి ఆయన అధ్యక్షుడయ్యాడు. ఆయన మా మాటలే మాట్లాడాడు. మేం ఏవయితే కావాలని కోరుకుంటున్నామో దాని కనుగుణ్యంగానే ఉపన్యాసం ఇచ్చాడు.


ఈ సభ అయిన తర్వాత ముక్త్యాల్లో నవ్యసాహిత్య పరిషత్తు సభ జరిగింది. 1945లో దేవులపల్లి కృష్ణశాస్త్రి, మరి కొంత మందీ నేనూ అందరం కలిసి రాజమహేంద్రవరం నుంచి బయల్దేరి వెళ్లాం. అక్కడనుంచి ఓ బస్సు ఏర్పాటు చేశారు. మేం వెళ్లేసరికి ఉదయపు సభ ప్రారంభమయిపోయింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రాలేదని ఆ సభలో అందరూ ఎదురుచూస్తూ వున్నారు. ఆయన వెంట మేమూ ఉన్నాం. యువతరం వాళ్లం. వారు ఏం కోరేరంటే మీరు కాఫీ అయిపోయినతర్వాత సభకి తిన్నగా వొచ్చియ్యాలి. స్నానం తర్వాత చేసుకుందురు అన్నారు. కృష్ణశాస్త్రి కేశసంస్కారం చేసుకోవాలి. బట్టలు మార్చుకోవాలి. ఇవన్నీ విధిగా ఉండితీరాలి. అవన్నీ లేకుండా అలాగే రమ్మన్నారు. శ్రీ జగన్నాధ స్వామి దేవాలయానికి వెళ్లి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఓ పద్ధతుంది. రైలు దిగ్గానే ఆ దుమ్ము దుస్తులతోటి అలాగే జగన్నాథస్వామి ఆలయానికెళ్లి దర్శనం చేసుకోవాలి. దానిని వాళ్లు ధూళి దర్శనం అంటారు. అల్లాగ్గానే ధూళితో వచ్చి సభలో కూర్చోమన్నారు.


అది పెద్ద సభ. ముక్త్యాల అంటే జమీందారుగ్రామం. ఈ నవ్యసాహిత్య పరిషత్‌ అన్ని ఖర్చులు పెట్టుకొంటున్నవారు ఆ జమీందారుగారే. అందుకే ఆ మారుమూల పల్లెటూల్లో ఆ జమీందారు ప్రాసాదంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఏర్పాటు చేయడంలో నవ్యసాహిత్య పరిషత్‌ కార్యకర్తలు చాలా సమర్ధులు. ఎప్పుడో నాలుగువందల సంవత్సరాలకు పూర్వం రోజుల ఆస్థానాలలో సాహిత్య సభలు జరిగేవే! దాంతో సమానంగా ఈ రాజప్రాసాదంలో సభను తయారుచేశారు. మహాఘనం అయిన సభ. అసలున్నదే రాజప్రాసాదం. ముక్త్యాల జమీందారుల గారి ప్రాసాదం. ఆ జమీందారే ఈ సభ నిర్వహణాధికారి. దాని డబ్బూ మంచీ చెడ్డా అంతా ఆయనే పెట్టారని నా నమ్మకం. మరెవరూ ఇచ్చినట్టు లేదు. అంచేత సభ చూడ్డానికీ బాగా ఉంది. రమ్యంగా ఉంది. చాలా ఖరీదుగా ఉందంతా! కూర్చున్నాం. చూస్తున్నాం. ఏదో సభ అయింది. ఆ తరువాత భోజనాలు. వెండి పళ్లాలందరికీ పెట్టారు. మంచినీళ్లు తాగడానికి వెండి పాత్రలే పెట్టారు. పులుసూ వగైరా వేసుకోవడానికి వెండిపాత్రలు. వడ్డించేవారు వెండి చేటలతో వడ్డించారు. వెండి గోకర్ణాలు, వెండి నేతి గిన్నెలు. అంతా వెండే. ఆ పంక్తి చూడ్డానికి చాలా ముచ్చటగానే ఉంది. శ్రీనాధుడుకి హేమపాత్రలే వాడి పంక్తియందు ఉన్నాయన్నాడే అయితే ఇక్కడ హేమపాత్రలు లేవు. గాని రజతపాత్రలు మాత్రం సమస్తం ఉన్నాయి.


ఆ సభకి తల్లావఝుల శివశంకరశాస్త్రిగారు రావాలి. ఆయన రాలేదు. ఏడాదికోసారి నవ్యసాహిత్య పరిషత్తు ఒక కవిగారికి సన్మానం చేస్తుంది. ఆ సంవత్సరం శివశంకర శాస్త్రిగారికి సన్మానం. ఆయన రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ సభకి వచ్చిన ప్రముఖులు ఎవరయ్యా అంటే విశ్వనాధ సత్యనారాయణగారు. ఆయనకీ ఈయనకీ పడదు. ఆ శివశంకరశాస్త్రి కవి ఏమిటి? అ కవి! అనే ధోరణిలో ఆయన మాట్లాడుతూ ఉండేవాడా రోజుల్లో! అంతే కాదు అది ఎక్కడో మీ దగ్గరా నా దగ్గరా కాదు. సభలో ఆయన ఎదురుగుండా అనేవాడు. ఆయన బాగా పెళుసుకదా! ఆ పెడసరితనంగా ఆ మాటంటాడనేటటువంటి భయంతో ఆయనుండగా నాకు సన్మానం వొద్దనుకున్నారాయన! రావడం మానేసాడు. అయితే ఇంకొక ఘనసన్మానం సభలో వుంది. అది గడియారం కవిగారికి ప్రొద్దుటూరువారు. శివభారత్‌ కర్త. వారికి ఘనసన్మానం జరిగింది. హేమపాత్రాన్నంలేదుగాని ఆయనకి నలుగు పెట్టి బంగారపు కలశంతో తలమీద నీళ్ళుపోసి, అభ్యంగన స్నానం అయాక నూతన వస్త్రాలిచ్చి రాజలాంఛనాలతో సన్మానం జరిగింది.


విశ్వనాధ సత్యనారాయణగారు ప్రత్యేకించి ఎందుకొచ్చారూ అంటే దానికొక విశేషం ఉంది. ముక్త్యాల జమీందారుగారి వంశంలో ఆడపిల్లని, ఓ ఆడపడుచుని చల్లపల్లి జమీందారీకి ఇవ్వడం ఓ ఆచారం! ఆ ప్రకారం చల్లపల్లి జమీందారు కివ్వడానికి సరియైన వయస్సు వున్న ఆడపడచులేదు. అందుచేత ఆ ఇంటికి అల్లుడు రాకుండా పోయాడు. ముక్త్యాల జమీందారుగారు విశ్వనాధవారి రామాయణ వృక్ష కల్పతరువులో నుంచి ఒక భాగమో రెండు భాగాలో నాకు జ్ఞాపకం లేదు. వారి స్వంత ఖర్చులమీద అచ్చువేయించి దానిని దత్తత చేసుకున్నారు. ఆ కావ్యాన్ని అంటే అక్కడ అచ్చయిన దానిని ఆయన దత్తత చేసుకున్నాడు. దత్తత చేసుకుంటే దత్తత పుత్రిక అయిందికదా! దానికి కృతిపతిని చేసి చల్లపల్లి జమీందారుగారికి ఇచ్చారు. అంటే ఏమన్నమాట? కావ్యకన్యను కన్యాదానం చేసినట్టయింది. ఆ కారణంచేత ఆయన ముక్త్యాల వారికి అల్లుడయ్యాడు. ఈ కార్యక్రమానికి ఆ జమీందారుగారూ అందరూ వచ్చారు. విశ్వనాథ సత్యనారాయణగారూ వున్నారు. ఇవన్నీ చూడ్డానికి మాకు విచిత్రంగానూ చాలా గమ్మత్తుగానూ ఉన్నాయి. ఇదీ సభకి ముఖ్యమైన విశిష్టత!


ఆ సభలో మా తరఫున దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు మాట్లాడారు. కుర్రవాళ్లలో నన్నూ మాట్లాడమన్నారు. నేను పెద్ద ఉపన్యాసకుణ్ణికాను. అందులో కుర్రవాణ్ణి. కూర్చున్నవారంతా హేమాహేమీలు. సరే అని నేన్నమ్ముకున్న వేవో నాలుగు మాటలు చెప్పడానికి అభ్యంతరంలేదు కాబట్టి ఆ నాలుగు మాటలూ నేను చెప్పాను. ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా నా అభిప్రాయాన్ని చెప్పడానికి సావకాశమైన పద్ధతిలో మామూలుగా చెప్పాను. దానికి నేనే అభ్యుదయ కవిని. వీళ్లు కారు అన్నారు విశ్వనాధ సత్యనారాయణగారు. ఎంచేత అంటే దేశానికేది కావాలో ఏది ప్రయోజనాన్నిస్తుందో ఏది కాదో ప్రజలకి అదే నేను రాస్తున్నాను. అందుచేత నేనే అభ్యుదయ కవినన్నారాయన!


దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు గంటో గంటన్నరో ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ప్రజల పక్షాన మాట్లాడారు. అభ్యుదయ సాహిత్య సంబంధంతో మాట్లాడారు. మేం మాట్లాడిన, మాట్లాడవలసిన భావాలే ఆయన వ్యక్తం చేశారు. చాలా ఆవేశంతో మాట్లాడారు. దేశం ఆపదలో ఉంది. ప్రజలు మహాదరిద్రంలో ఉన్నారు. దేశం బానిస దేశమై ఉంది. ఈ కారణంచేత దానికనుగుణ్యంగా కవులు రాసి తీరాలి. నడిరోడ్డుమీద వాళ్లు నిలబెట్టి అడుగుతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావ్‌? ఏమిటి రాస్తున్నావ్‌. మేమట్లా చచ్చిపోతున్నాం. దేశం ఈ దశలో ఉంది. బ్రిటిషువాళ్లు పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలనంతా అసందర్భంగా ఉంది. ఇవన్నీ మనల్ని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మనమేమిటి సమాధానం చెప్పడం? అందుచేత వాళ్లకి అనుగుణ్యంగా మనం రాయాలి. ఇలా గట్టిగానే మంచి ఉపన్యాసం ఇచ్చారు. అందర్నీ కదిలించే విధంగా అది ఇచ్చారాయన. అక్కడున్న వాళ్లలో సనాతన వర్గం వాళ్లు కూడా వున్నారు. వాళ్లని కూడా కదిలించాడాయన! తర్వాత విశ్వనాధ సత్యనారాయణగారు నువ్విలాంటి ఉపన్యాసాలు నేనుండగా ఎప్పుడూ ఇవ్వకు అన్నారు. నన్నేం చెయ్యమన్నావ్‌. రామాయణ కల్పతరువింకా రాయలేదు. నేనింకా పూర్తి చెయ్యలేదు. అది నన్ను పూర్తిచెయ్యమన్నావా? ఇలాంటివి రాసుకోమన్నావా? మానేస్తే బాగున్ననే భావం నాకూ కలిగింది. నేనేం చేయను?'' అని ఆయన మందలించారు.


సాపాటైన తర్వాత ముక్త్యాల నుంచి బస్సులో బెజవాడికి తిరుగుప్రయాణం. మా బస్సు మహాఘనమైన బస్సు. ఎందుచేతనంటే కృష్ణశాస్త్రిగారు, కాటూరివారు, గ్రంథాలయోద్యమం వారు అయ్యంకి వెంకటరమణయ్యగారు అందరూ ఉన్నారు. కాటూరి వారూ కృష్ణశాస్త్రిగారు మంచి స్నేహితులు. అవినాభావ సంబంధం గల స్నేహితులు. ఆయనంటే ఈయనకీ ఈయనంటే ఆయనకీ చాలా గౌరవమైన భావాలున్నాయి. అయినా ఈ అయినింటివాళ్లూ అందరూ కలిసి సరససల్లాపాలాడుకుంటూ కృష్ణశాస్త్రిగారిని ఆటపట్టించడానికి ''గోదావరికద్దరిని ఊళ్లు లేవు'' అన్నారు. అంటే కృష్ణశాస్త్రిగారిది పిఠాపురం కదా! అంచేత గోదావరికి ఇవతల భాగంలోనే ఉండవలసిన వాళ్లంతా వున్నారు. అంటే గొప్పవాళ్లంతా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వున్నారని వాళ్ళ ఉద్దేశం. గోదావరికి అవతలకి పోతే ఇంకేం లేదు. అది తమ నానుడి. నేనంతా విన్నాను. మా సైడు మేం కూడా ''గోదావరి కద్దరిని ఊళ్ళు లేవనే'' అంటూ ఉంటాం. ఈ నానుడి నిజమేనండీ! అన్నాను. దానికి కృష్ణశాస్త్రిగారు గొల్లున నవ్వారు. ఈ కుర్రవాడు ఎందుకలా అన్నాడో పాపం వాళ్లకి తెలీలేదు. కృష్ణశాస్త్రిగారిని వాళ్లంతా ఏదేదో అంటున్నారు. దానికి నేనూ తిరిగి అన్నాను. దానికి కృష్ణశాస్త్రిగారు ఎందుకు నవ్వుతున్నారో ఏం అర్ధం కాలేదు. అద్దరి వారికందరికీ! ''మొత్తం మీద మేమూ గోదావరి కద్దరి ఊళ్లులేవని అంటున్నాంగదా! వాస్తవంగానే అంటున్నాం అన్నమాట'' మరోసారి నేను నొక్కి చెప్పేను. కృష్ణశాస్త్రిగారు నవ్వడం పూర్తయిన తర్వాత 'సోమయాజుల్ది విజయనగరం. గోదావరికి అద్దరివాడే'' అన్నారు.


ముక్త్యాల సభలో మరో విశేషం కూడా జరిగింది ఆ సభలో 15 సంవత్సరాలలోపు కుర్రవాడి చేత పద్యాలు చదివించాం. ఆ కుర్రవాడి పేరు శరభయ్య. తను రాసిన పద్యాలే ఆ కుర్రవాడు చదివాడు. ఆ కుర్రవాడు నా శిష్యుడు, నా శిష్యుడని ఇద్దరు ప్రముఖులు వాదోపవాదాలు చేస్తున్నారు. ఆ కుర్రవాడు వాస్తవానికి ఇద్దరికీ శిష్యుడిలాగానే ఉన్నాడు. ఒకరు కాటూరి వెంకటేశ్వరరావుగారు. రెండోవారం విశ్వనాథ సత్యనారాయణగారు. కుర్రవాడు చిన్నవాడే గాని చాలా చక్కగా పద్యాలు రాయడం అలవర్చుకున్నాడు. చక్కగానే చదివాడు. కుర్రవాడు మల్లంపల్లి వాడు సభలో మల్లంపల్లి సోమశేఖర శర్మగారూ వున్నారు. ఆ సభకి ఆయనే అధ్యక్షుడు. ఆయన వెంటనే ఆ కుర్రవాణ్ణి కావలించుకుని ఆనందాశ్రువులతో మా మల్లంపల్లి వంశంలో ఈ మాత్రం కుర్రవాడింత చక్కగా పద్యాలు రాసేవాడుద్భవించినందుకు నేను చాలా గర్వపడుతున్నాన్నంటూ చాలా చెప్పారు. విశ్వనాధ సత్యనారాయణగారు. కృష్ణశాస్త్రిగారిని నా ఎదుట అలా ఉపన్యాసాలివ్వొద్దు అంటూ నన్ను రాయడం మానేయమంటావా అని కాదు ఈ శరభయ్యని పద్యాలు రాయడం మానేయమంటావా? లేక నువ్వు చెప్పినట్టు రాయమంటావా? అని ప్రశ్నించారు.


అప్పటికి జమీందారీలు రద్దుకాలేదు. చాలా మంది జమీందార్లు చాలామంచి స్థితిలో వున్నారు. వారిలో ముక్త్యాల జమీందారుగారు ఒకరు. ఆ పాతకాలాన్ని గుర్తుకు తెస్తూ నవ్యసాహితీ పరషత్తు ఆ సంవత్సరం జరిగింది. కాని నవ్యసాహిత్య పరిషత్తు అంతటితో సరి. ఆ తరువాత మరి జరగలేదు. మరి నవ్యసాహిత్య పరిషత్తులేదు. ఎందుకాగిపోయిందో తెలియదు. కాని ఆ జమీందారీ ప్రాసాదంలో ఆగిపోయింది. ఆనాటి జమీందార్లు వాస్తవంగానే సాహిత్య పోషకాలు. చాలా మంది కవులకు సన్మానాలు చేస్తుండేవాళ్లు. వాళ్లింటికి వెళ్లి నమస్కారం చేస్తే ఏదో ఓ వెయ్యినూట పదహార్లు నుండి నూటపదహార్లు వరకూ డబ్బు కూడా ఇచ్చేవారు. అలాగ నాకో జమీందారు నూటపదహారు రూపాయిలిచ్చారు. అదీ ఓ విచిత్రమైన సన్నివేశం. చాలా ఇబ్బందిపడి పుచ్చుకొని బైటికి రాకతప్పలేదు. అది ఇచ్చినందుకు నేను చాలా వ్యధ పొందాను. ఎందుకంటే నేను దాన్ని ఆశించి నేనాయన దగ్గరికి వెళ్ళలేదు. వారిస్తారని నేను అనుకోలేని నేను సంతోషించలేదు. ఇబ్బందిపడ్డా. ఆనాటి జమీందార్లు చాలా మంచిస్థితిలోనే ఉండేవారు. ముక్త్యాల జమీందారుగారు నవ్యసాహితీ పరిషత్‌ నిర్వహణ చేసి ఆనాటి కాలాన్ని కళ్ళకి కట్టేటట్టు యువతరమైన మా అందరికీ తెలియజేశారు. నవ్యసాహితీ పరిషత్‌కి నేనే కాదు అనిసెట్టి సుబ్బారావు బెల్లంకొండ రామదాసు మొదలైన వారందరూ వచ్చారు. నవ్యసాహిత్య పరిషత్తు ప్రాచీన కాలపు శోభతో 1945లో జరిగింది.


ఆ మరుసటి సంవత్సరం బూర్జువా సాహితీవేత్తల మహాసభ జరిగింది. బూర్జువా సాహిత్యవేత్తల మహాసభ అన్నానుగానీ దానిపేరు మాత్రం అదికాదు. దానికో పేరు ఉంది! ఆ పేరుతో నేనున్నాను. పేరులో చింతించవలసిన పేరది! ఆ పేరే అభ్యుదయ రచయితల మహాసభ. నాల్గవది! రాజమండ్రి మహాసభ అంటే తృతీయ మహాసభ - అభ్యుదయ రచయితల సభ అయిన నాడే అరసం పలచబడిపోయింది. దాంట్లోకి ఈ నవ్యసాహిత్య పరిషత్తు సభ్యులంతా చేరేరు. అంటే వామపక్షపు భావాలు లేని వారంతా చేరారు. అందులో ప్రధానమైన వాళ్లు ఎవరయ్యా అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. ఆయన దాని కధ్యక్షుడు. చదలవాడ పిచ్చయ్య మా కార్యదర్శి. పిచ్చయ్య పిచ్చయ్యే. అతన్ని పిచ్చయ్యగా పూర్తిగా చేసినవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రే. మద్రాసు మహాసభంతా పిచ్చయ్య అనుకున్నట్టూ, మేమనుకున్నట్టు జరగలేదు. కృష్ణశాస్త్రిగారు ఏం చేస్తే ఆ ప్రకారం జరిగింది. మేమంతా దూరాభారానున్నాం. పిచ్చయ్య మద్రాసులో చేద్దాం అన్నాడు. రాజమన్నారుగార్ని అధ్యక్షులుగా పెడదామన్నాడు. ఆయన ఆమోదించారు. దానికి మాకేం అభ్యంతరం లేదు. ప్రారంభ ఉపన్యాసం ఇచ్చేందుకు ఎ. అబ్బాస్‌ను బొంబాయి నుంచి తెప్పిస్తాం అన్నారు. దీనికీ మా అభ్యంతరంలేదు. మా భావాలకు దగ్గర భావాలున్నవాడు. అంచేత ఆయన ప్రారంభోపన్యాసం చేయడం బాగుంటుంది. కాని ఆ సభ కొచ్చిన వాళ్లెవరు? ఆ ప్రణాళిక మీద సంతకం పెట్టిన వారంతా మా సభ్యులే. ఆ ప్రణాళిక చదువుకుని దాన్ని ఆమోదించే వాళ్లు ఎంత మాత్రం కాదు. ఆ సభకి ఆహ్వానించిన వాళ్లలో విశ్వనాథ సత్యనారాయణ దాకా అందరూ ఉన్నారు. ఈ సభకి రావలసినదిగా కోరుతూ ఎన్ని ఉత్తరాలు రాసినా నేను రాలేను. రావడానికి అవకాశం లేదని రాసిన వారు రాయప్రోలు సుబ్బారావు. మనం టెలిగ్రాం ఇచ్చి విమానంలో రండి అని అందామా అని కృష్ణశాస్త్రిగారు అడిగారు - పిచ్చయ్యా, మేమంతా ఉండగా అడిగారు. విమానం చాలా ఖర్చయిపోతుందండీ అని మేం అంటే దానికేముందీ ఎక్కడైనా ప్రయత్నిద్దాం అని కూడా అన్నారు. మేం దాన్నామోదించలేదు. విమానం మీద రాయప్రోలు వారిని రప్పించి ఆ సభల్లో పాల్గొనేటట్టు చేయాలని వారి కోరిక. ఇదేదీ మాకు సమ్మతం కాదు. నాకే కాదు. మా యువతరం ఎవరికీ సమ్మతంకాదు.


ఆ సభలో అందరూ ప్రసంగాలిచ్చారు. ఈ ప్రసంగాల్లో సాహిత్యానికి ప్రయోజనం ఉండాలని అందరూ వ్యక్తం చేశారు. సనాతనులూ, ఆధునికులు కూడా. ప్రయోజనం అంటే ఏ ప్రయోజనమనే తేడా వుంది. ఆ తేడానే వారికీ, మాకూ ఉండనే వుంది. అంచేత వారందరూ ఈ వేదిక ఆక్రమించడం చాలా అన్యాయంగా ఉంది.! ఈ పిచ్చయ్యగారు వేదిక మీద ఎవరెవరు మాట్లాడతారో పరిచయం చెయ్యటం దండలు వేయటం - ఈ కార్యక్రమమంతా నిర్వహించవలసినదిగా దేవులపల్లి కృష్ణశాస్త్రినీ ఆయనకు అసిస్టెంటుగా నన్నూ పెట్టారు! దానికి అసిస్టెంటుగా ఉండడం నాకిష్టంలేదు. కింద కూచుంటాను అంటే అబ్బే అలాకాదు నువ్వే ఉండాలని అన్నాడు. అలాగే అ.న. శర్మగారిని (పండిత అయల సోమయాజుల నరసింహశర్మ) నాలుగు రోజులు ముందే రమ్మని, అతనికి కొన్ని పనులు అప్పజెప్పి, ముఖ్యంగా వచ్చిన ప్రతినిధులందరికీ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు వగైరా సదుపాయాలు చూడమని అప్పజెప్పారు. ఆయన ఎర్రటి శాలువా ఒకటేసుకుని, ఎర్రగా ఉండేవాడేమో, గుర్తు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళండని చెప్తూ ఉండేవాళ్లం. ఆయన కనబడుతుండేవాడు ఎక్కడో ఓచోట. ఆయన దగ్గరకెళ్తే కార్డులు అవీ ఇచ్చేవాడు. మా అ.న. శర్మగారి ఉద్యోగం బానే ఉంది. అది నాకిమ్మంటే పిచ్చయ్య ఇచ్చేడుకాదు. ఈ ఉద్యోగం నాకెందుకు? తలకాయనొప్పి. చుట్టకాల్చుకుంటుండేవాణ్ణి. అస్తమానం ఆ చుట్ట కాల్చడం చేత, దానికి ఆటంకంగా ఉన్న కారణంచేత, అంటే ఇంతా మహాసభకి వచ్చి చుట్టకాల్చడం గొప్పా అంటే అక్కడ వేదిక మీద ఉపన్యాసాలు వినడం కంటే చుట్ట కాల్చడమే మంచిదని నాకు అభిప్రాయం కలిగింది. లేకపోతే ఆ వేదిక నిర్వహించడం సంతోషంగానే, గర్వపడుతూనే ఒప్పుకునే వాణ్ణి. అదీ అసలు సంగతి.


ఉదయాన్నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల దాకా సభలయ్యాయి. అలాగే సాయంకాలం ఏ ఐదు గంటలకో ప్రారంభమయ్యేవి. చెన్నపట్నంలో ఉన్న సాహితీవేత్తలందరూ సభకి విచ్చేశారు. పై ఊళ్ళ నుండి వచ్చిన మేమం దరం కూడా ఏ రెండు మూడు వందలమో ఉంటాం. కొందరికి తెలుగు వస్తుంది. కొందరికి రాదు. అయినా సరే ఆంధ్రదేశంలో ఉన్న ప్రముఖ తెలుగు రచయితలందరూ వస్తున్నారు. సభ చేస్తున్నారని, వాళ్లందర్నీ చూద్దామని వాళ్లొచ్చారు.


సభ మాత్రం చాలా గంభీరంగా వుంది. మాంబళంలో వాణీమహాల్‌ అని ఓ హాలుంది. ఆ హాలు మనదే! - అంటే మేం ఆ సభ పెట్టిన రోజులకి! ఎందుచేత అంటే ఆ హాలు చిత్తూరు నాగయ్యగారిది. ఆయన కట్టించుకున్న హాలు. తర్వాత దాన్నమ్మేసారు. ప్రస్తుతం అయితే మనది కాదు! ఆహాల్లో ఈ సభ పెట్టడం చాలా సంతోషంగా వుంది. అదీకాక మాకు జీపెవరో ఇచ్చారు. ముఖ్యంగా కాంచనమాల, నటీమణి విదేశీ కారొకటి మాకు సొంత కారుగానే వాడమంది. ఆ కారు కూడా వుంది. కారూ, జీపు - ఘనంగా పెద్ద ఎత్తుగానే సభలు జరిగాయి. మేముండడానికి వసతులూ బాగానే వున్నాయి. కృష్ణశాస్త్రిగారింట్లోనే బసవేశాం. ఆయనింటి పక్కనే ఒక భాగం మాకు కేటాయించారు. మేమంతా అందులో పడుకునేవాళ్ళం. అయితే సభలు జరుగుతున్నాయిగానీ సంతృప్తిగా లేదు.


ఆవేళ సాయంకాలం సభ అయిపోయింది. ఎనిమిది గంటలు ఆ ప్రాంతాలైంది. వేదికమీదున్న వాళ్లంతా కిందకి దిగాల్సివచ్చింది. సాంస్కృతిక కార్యక్రమం ఆ వేళ ఓ నాటకం ఉంది. ఆ నాటకం అభ్యుదయ భావాల్తో కూడుకున్న మా సభ్యులు రాసిన నాటకం. ఆ నాటకం తప్పకుండా చూడాలని ముందు వరసల్లోనే కూర్చున్నారు. నా పక్కన కృష్ణశాస్త్రిగారు, ఆ పక్కన రాజమన్నారు కూర్చున్నారు. ఆ ఉదయం గానీ సాయంకాలం గానీ ఆ సభలో ఎంత మంది ఏ రెండువేలమందో వెయ్యిమందో పడతారు. అది నాకు తెలీదు కాని హాలు నిండిపోయింది. అవతలా వున్నారు. ఇవతలా వున్నారు. జనం కిటకిటలాడుతున్నారు!
ఎప్పుడూ ఎవరూ చుట్టగానీ, సిగరెట్టుగానీ కాల్చలేదు! నాటకం చూడ్డానికి మొత్తానికి ఆసక్తితోటే వున్నాం. అప్పుడు రాజమన్నారుగారు ఠపీమని ఓ సిగరెట్టు వెలిగించారు. అది నేను చూశాను. చాలా కోపమొచ్చింది. ఆయన ఆ సిగరెట్టు వెలిగించడం తప్పని చెప్పడానికి ఆయన మాకధ్యక్షుడు. హైకోర్టు జడ్జిగారు. ఏం మర్యాదగా వుంటుంది? కానీ ఆయన మార్గం వేశాడు కదా! ఆ పని నేనెందుకు చేయకూడదని ఠపీమని నేనొక చుట్టతీసి వెలిగించాను. అప్పుడు చుట్టకాల్చిన వారు మా సాహిత్యలోకంలో పెద్దలు చాలా మందే వున్నారు. అందులో కృష్ణశాస్త్రిగారు కూడా వున్నారు. నా పక్క ఇలా జూసి ''బతికించావని'' ఆయినా ఓ చుట్ట తీసాడు. మేం చుట్టపొగ వదుల్తుంటే అది కింద నుంటుందా? మీద కెళ్లింది. అది జూసి ఇహ నొక్కొక్కడూ ముట్టిం చాడు. ఓ ఐదు, పది నిమిషాలైందో లేదో వాణీ మహలు మీదని పొగ చాందినీ లాగ కప్పేసింది. అందుచేత ఈ సభ పొగ పట్టేసింది. మా అభ్యుదయ రచయితల సంఘమూ పొగ పట్టేసింది. మా పొగ కూడా దీనికి సహకరించింది.


సభలన్నీ అయిపోయిన తరువాత ఊళ్లో చాలా చోట్లకి తీసుకెళ్లారు. క్రిష్టియన్‌ కాలేజీవాళ్లు ఈ వచ్చిన వాళ్లనందర్నీ ఆహ్వానించడం ఘనసన్మానం చేయడం వాళ్ల చేత పేలించడం అన్నీ చేశారు.
చదలవాడ పిచ్చయ్య ఇన్నాళ్లూ రాత్రి నిద్రలేదు. పగలు ఆహారంలేదు. చాలా కష్టపడి పనిచేశాడు. దానిలో ఏం లోటు లేదు. అయితే లోటల్లా ఏమిటంటే అభ్యుదయ భావాలకు విరుద్ధంగా ఉన్నవాళ్లందరికీ వేదిక ఇవ్వడం! అంచేత సభ సక్సెస్‌ కన్నా అన్‌ సక్సెస్‌.


కృష్ణశాస్త్రిగారింటి ముందు మామిడి చెట్టుంది. దాని కింద ఎత్తు కుర్చీలుండేవి. వాహినీ వాళ్లు సప్లై చేసినవి. మల్లీశ్వరికి కృష్ణశాస్త్రిగారు పాటలు రాస్తున్నారు. బి.ఎన్‌.రెడ్డిగారు వచ్చి అక్కడ కూర్చుంటుండేవాడు.
మేమంతా ఆ మామిడిచెట్టు కింద కుర్చీల్లో కూర్చుని ఉంటే పిచ్చయ్య వచ్చాడు. సభలు అయిన మర్నాడు. మర్నాడెందుకున్నాడంటే ఇవ్వాల్సిన డబ్బులు గిబ్బులు, ఏవేవో బాకీలు, అప్పచెప్పాల్సిన సామాన్లు - అన్నీ అప్పగించేసి పూర్తిగా సభ తాలూకా వ్యవహారాలన్నీ చక్కబెట్టేసి, చేతులు కడుక్కుని వచ్చాడు. కుర్చీల్లో ఎక్కడా ఖాళీ కూడా లేదేమో. ఇంటిగుమ్మం ముందు మెట్లున్నాయే ఆ మెట్ల మీద కూలబడి వల వల వలవల ఏడవడం మొదలుపెట్టాడు.'ఏవిటి పిచ్చయ్యా ఏడుస్తాన్నావ్‌' అంటూ కృష్ణశాస్త్రి అడిగితే చెప్పడే! ఎవరడిగినా చెప్పడు. ఏడ్చేస్తున్నాడు.చెప్పు. అలా ఏడుస్తువేంటి?'' అని భుజం పట్టుకుని అడిగితే జేబులోంచి ఓ కాగితం తీసి బైటపెట్టాడు. ఆ కాగితం ఓ టెలిగ్రాం. ఆ టెలిగ్రాంలో చదలవాడ పిచ్చ య్యని వెంటనే రమ్మనమని ఉంది. కారణం ఏమిటి? ఆయన తండ్రి చచ్చిపోయాడు. అదెప్పుడు చచ్చిపోయాడు? ఈ సభలకి ముందే చచ్చిపోయాడు. ఈ సభాకార్యక్రమం అంతా అతగాడి నెత్తిమీద ఉంది. ఆ కాగితాన్ని జేబులో పెట్టే సుకుని, అది పూర్తిగా మర్చిపోయి ఇంత సభానిర్వహించి సభంతా అయిపోయి దాని ఖర్చు వెచ్చాలు కూడా సెటిల్‌ చేసి ఆ తర్వాత వచ్చి కూలబడ్డాడు పిచ్చయ్య. అంత పట్టుదలైనవాడూ అంత నిగ్రహం ఉన్నవాడు! ఓదార్చాం. ఓదార్చిన తర్వాత ఆ సాయంకాలం బండెక్కించాం. అతడేమో వెళ్ళిపోయాడు.


మేమేమో ఆ సాయంకాలమో ఎప్పుడో, చెంచయ్యగారింట్లో ఉన్నాం. ఆయన విప్లవకారుడు అదే గదర్‌పార్టీలో. అక్కడ కూచుని కొంత కాలక్షేపం నేను అనిసెట్టి చూస్తూండేవాళ్ళం. తెల్లారేసరికి మెడ్రాసంతా గందరగోళం అయిపోయింది. టంగుటూరు ప్రకాశంగారు కమ్యూనిస్టులమీద విరుచు కుపడ్డారు. ఎక్కడ వాళ్ళనక్కడ అరెస్టు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే. మా చుట్టూ కూడా వేన్లు తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడ స్టూడెంట్లో ఏం జరిగాయో అన్నీ వచ్చి చెపుతున్నారు. ''కమ్యూనిస్టు పార్టీ మీద దండయాత్ర జరిగింది. దక్ష్షిణ దేశం నుండి అంటే తమిళనాడు లేబర్‌ నాయకుడు, ఎవరో అతనికి కావాలిట. అతనిక్కడ లేడు. పోలీసులు పట్టుకుపోయారు. మీరె వారు-ఏమిటి, ఎందుకతను మీక్కావాలి అంటే అతను ఫలానా అని చెప్పాడు. ఎందుకైనా మంచిది. మీరెళ్లి పోండి. ఇక్కడ ఉండకూడదు. మమ్మల్నీ పట్టుకు పోతారు'' అయితే ఈ పక్కనుంచీ వచ్చాను నేను. అక్కడ పోలీసు వేన్లు ఉన్నా యి. అందచేత ఈ పక్కనుంచి వెళ్ళిపోతామని పాపం ఆ స్టూడెంట్లకి చెప్పాం. ఆవిధంగా అభ్యుదయ రచయితల నాల్గవ మహాసభలు మేం పూర్తిచేశాం


 ఈ నాల్గవ అభ్యుదయ రచయితల మహాసభ వాస్తవంగా అభ్యుదయ రచయితల మహాసభ కన్నా బూర్జువా రచయితల మహాసభ అని నేను మనసులో అనుకున్నాను. అయితే అందులో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అభ్యుదయ పరమైనవే. హాలు నిండా జనం ఉండి అవి చూశారు. అందుచేత నాల్గవ అభ్యుదయ రచయితల మహాసభ బూర్జువా రచయితల మహాసభగా అనుకున్నా ఈ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల కొంత ఊరట కల్గించాయి.

 (1978లో వెలుగురామినాయుడుగారు చాసో చెప్పగా రికార్డు చేసినది.)
http://www.visalaandhra.com/literature/article-34828

 

Read 9229 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

            Dear Community Members, We hope and wish...
Executive Committee Honorary Advisors Trust Boardకార్యవర్గం గౌరవ...
  'భోగి' భోగభాగ్యాలతో సంక్రాంతి'...
 Dear Patron,   It’s that time of the year and TAGKC executive committee...

Who's Online

We have 41 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...