అందుకే సురాకృతి సుకృతమైన ప్రతిభకు భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే సాహిత్యాన్ని ఒక మార్గంగా తీసుకుని వర్తమాన కాలంలో ఆర్షధర్మానికి ఏకైక ప్రతినిధిగా నిలిచారాయన. తన జీవితాన్ని, సాహిత్యాన్ని, భారతీయ వైభవ పునరుద్దానికై త్రికరణశుద్ధిగా అంకితం చేసిన రుషి వంటి కవి ఆయన.
1895 సెప్టెంబర్ '10'న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాధ సత్యనారా యణ తల్లిదండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి, సంపన్న కుటుంబంలో పుట్టినా దారిద్య్ర వ్యధలనను భవించిన ఉదారుడాయన. సత్యనారాయణగారి వ్యక్తిత్వం విలక్షణమయింది. బహిరంగ ప్రసంగాల ద్వారా తన ఆశయాలనూ, ఆదర్శాలనూ దాపరికం లేకుండా ప్రతిపాదించినా అంతరంగంలో స్వచ్ఛత నిలుపుకొన్న మనిషి ఆయన. ఎందరిని ఎన్ని విధాలుగా ఎంతగా, తూలనాడినా, ఆత్మీయతా ప్రదర్శన తో అతిథి మర్యాదలతో కులమతాతీతమైన ఆర్థ్రహృదయంతో సమ్మోహనపరచిన కొద్ది మందిలో ఆయన ఒకరు. ఈ వైరుధ్యం ఆయన రచనల్లోనూ కనిపిస్తుంది. ఆయన వచన రచనలు, తద్విరుద్ధమైన ద్రాక్షాపాకంలో నడనిచాయి. పాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన 'విశ్వనాధ' గారి 'వేయి పడగలు' మాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతహాసం 'వేయిపడగలు'. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ఆ కాలంలో విశ్వనాధ వాణి ఆంధ్ర పౌరుష(1917), ఆంధ్ర ప్రశస్తుల(1919) రూపంలో సాహితీ రంగ ప్రవేశం చేసింది.
తన తొలి రచనలతోనే శ్రీశ్రీ వంటి ప్రతిభావంతున్ని మంత్రముగ్థుణ్ణి చేసి అనుకర్తగా ఆరాధకుడుగా, తీర్చిదిద్దినవాడు విశ్వనాధ. ఆ తరువాత శతాధికరచనలు చేసిన కొద్ది మందిలోనూ ఆయనే అత్యంత ప్రశస్తి పొందినవాడు. శ్రీనాధుడు తరువాత పరిసర ప్రకృతిని అంతగా పరిశీలించి వర్ణించిన మరో కవి విశ్వనాథే. ఆయన భాషా జోత్యభిమానాలకు తెలుగు రుతువులే నిదర్శనం. ఆయన రచనల్లో ప్రజాభిమానం సంపాదించినవి' 'కిన్నెరసాని' పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఆంధ్రా ప్రశస్తులు, విశ్వనాథ సత్యనారాయణ అభిమా నించిన రచన మాత్రం శ్రీ మద్రామాయణ కల్పవృక్ష (1934-62)మనే మహారచన. ఆ రచనకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. ఏకవీర చలన చిత్ర మయింది. చెలియలికట్ట పేరు తెచ్చింది. వరలక్ష్మి శ్రీశతి అనే స్మృతికావ్యం గుండెలు కరిగిస్తుంది. చారిత్రక నవలగా బద్దెన్న సేనాని ప్రతిష్టతెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితాధోరణుల మీద ఆయన విమర్శ వ్యాసాలు ప్రశంసలు కురిపించాయి. ఆంధ్రసాహిత్య చరిత్రను, భారతావతరణము'వంటి పది రేడియో నాటికలుగా మలిచారు. అమృత శర్మిష్ఠమ్, గుప్తపాశుపతమ్, అనే నాటకాలను 'ఆశ నిరాసకు' అనే నాటికను, 'దేవీ త్రిశతి' శివసాహస్రకు, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించాడు. సత్యనారాయణ గారి రచనలో ప్రతిదీ ఒక సంచలన రచనే అయింది. ఆ రచనలు వస్తురీత్యా, ప్రయో గరీత్యా, శిల్పరీత్యా, ప్రమాణాల రీత్యా సంచలనం కలిగించినవే. ఈ సంచలనంలో ఆయనను సాంప్రదాయకులూ, సాంప్రదేయే తరులూ విమర్శకుల రూపంతో సమంగానే ఎదుర్కొన్నారు. అడ్డగించటానికి ప్రయత్నించారు.
అయినా ఈ అవరోధాలన్నింటినీ సమర్థంగా తొలగించుకొంటూ విశ్వనాధ తొలిసారిగా సాహిత్య సరస్వతి ప్రవహించింది. తెలుగు నవలా సాహిత్యంలో తొలిసారిగా నవలకు 'కావ్య' గౌరవం సంపాదించి పెట్టింది. 'ఏకవీర' వస్తువు,దీని నిర్వహణపరంగా నూత్న ద్వారాలు తెరిచింది. కిన్నెరసాని పాటలు తెలుగులోని మాధుర్యాన్ని వాగులు పారించింది.
ఆయన చేపట్టని ప్రక్రియా ప్రయోగమూ లేదన్నట్టుగానే, మానవ జీవితంలో ఆయన స్మృశించని సమస్య కూడా లేదేమోననిపిస్తుంది. ఆయన ప్రతి నవలా, ప్రతి కథా ఏదో ఒక సామాజిక సమస్యనో, మానసిక సమస్యనో, ఆధ్యాత్మిక సమస్యనో, సాహిత్య సమస్యనో, ఆర్థిక, రాజకీయ సమస్యనో...ప్రధానీకరిస్తుంది. విశ్వనాధ సత్యనారాయణ ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, ఆధునికాంధ్ర సాహిత్యంలో వారసత్వం, గురువు చూపిన పద్యరచనా సంప్రదాయం ఆయనలో స్థిరంగా నిల్చిపోయాయి. తరతరాలుగా అవిచ్ఛన్నంగా వున్న భారతీయ ధర్మం, మాత్రమే ఏక కాలానికి అయినా మానవజాతికందరికి ఆదర్శం. అనుసరణీయమని ఆయన అచంచల విశ్వాసం. భారతీయ ధర్మాన్ని, ప్రతిభాపాండిత్యాన్ని విజ్ఞాన విశేషాలన్నీ కవిత్వంలో రసమయంగా మలచి అందించిన మహాకవి విశ్వనాథ. దాదాపు అరవై నవలలు రాసి, ఆ నవలా సృష్టిలో భారతీయ ధర్మంతో పాటు, ఆధునిక భావాలను వ్యాఖ్యాన ప్రాయంగా కథ కల్పన చేసిన నవలా చతురాస్యుడు. సంస్కృతనాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ఠ, తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి, కావ్యతేదహరిశ్చంద్ర ప్రసిద్ధమైనవి. దాదాపు 150 గ్రంథాలకు పైగా రచన చేసిన ఏకైక తెలుగు కవి, విమర్శకుడు విశ్వనాథ. ఆయనకు 1958లో శాసన మండలి సభ్యత్వం వచ్చింది. 1971లో ఆస్థానకవి పదవి సంక్రమించింది. 1942లో కలకత్తాలో పుష్పకిరీటసన్మానం జరిగాయి. 'విశ్వనాధ' కొలవెన్నురామకోటేశ్వరరావుతో కలిసి ''త్రివేణి' అనే దైవమాసికాంగ్ల పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు. ....'జయంతి' అనే దైవమాసిక తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. కవిగా, పండితుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, గాయకుడిగా రాణించిన విశ్వనాధ సత్యనారాయణ, 1976 అక్టోబర్ '18'న మరణించారు. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖవారు 1976లో 'విశ్వనాధ వాజ్మతు సూచిక'ను వెలువరించారు. 1982లో స్మారక సంఘం వారు 'విశ్వనాధ శారద'ను ఆవిష్కరించారు.
డి.పున్నచంద్
http://54.243.62.7/literature/article-63052